Preservatives and Its Negative Effects on Safe Lifestyle
నిల్వ ఆహారంతో అగచాట్లు : జీవకోటిలో అసంఖ్యాక రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి . వీటిలో ప్రధానమైనవి వైరస్ , బాక్టీరియా , శిలీoద్రాలు (బూజు రకాలు ). ఇవేవి ప్రకృతిపరంగా తమంతట తాము ఆహారాన్ని తయారుచేసుకోలేవు . మన ఆహారం మీదనే ఉంటూ తమ ఆకలిని తీర్చుకుంటూ , తమ వంశాలను వృద్ది చేసుకుంటున్నాయి. ఆహార పదార్దాల మీద వాలేటప్పుడు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత సంతానాన్ని వృద్ధి చేస్తాయి . వాలిన ఆహారపదార్థం అనుకూలంగా మారేంతవరకూ భుజించి , ఆ తర్వాత తామరతంపరగా వృద్ధి పొందుతున్నాయి . ఆహారం చీకటిలో ఉండి , అందులో ద్రవస్థాయి ఉంటే చాలు , కొద్దిసేపటికే సూక్ష్మజీవుల రాజ్యం ఏర్పడుతుంది . ఇవి ఆహార పదార్దాలను అతిసూక్ష్మంగా విడదీసే ప్రయత్నంలో ఉత్పత్తి అయ్యే వాయువుల ద్వారా దుర్వాసన బయలుదేరుతుంది . ఆహారం మొత్తం కలుషితమవుతుంది . దానినే మనం తింటే అనారోగ్యం ప్రాప్తిస్తుంది .
సూక్ష్మజీవులైన బాక్టీరియాలు , ఈస్ట్ లు , శిలీoద్రాలు, కీటకాల వలన ఎంజైముల చర్య వలన ఆహారపదార్దాలు సాధారణంగా చెడిపోతాయి . అన్ని జీవపదార్దాలలోనూ ఎంజైములుంటాయి . బాగా వేడి చెయ్యడం వలన ఇవి తమ ఉనికిని కోల్పోతాయి . అదుపు చేసిన కొన్ని పరిస్థితులలో కొన్ని సూక్ష్మజీవులను ఉపయోగించి ఆహారపదార్దాలలో వాంఛనీయమైన మార్పును పొందవచ్చు . పాల నుండి పెరుగు తయారు కావడం దీనికి చక్కని ఉదాహరణ . జీవకణాలు ఉత్పత్తి చేసే కర్బన ఉత్ప్రేరకాలనే ఎంజైములంటారు . ఇవి ప్రోటీనులు కాబట్టి వేడి చేసినప్పుడు వాటి స్వభావాన్ని కోల్పోయి చర్యరహితములవుతాయి . ఆహారపదార్దాల నిలవలో జరిగే మార్పులకు కారణం ఆయా పదార్దాలలో గల ఎంజైములు , లేదా ఆ ఆహారపదార్దాలలోని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసిన ఎంజైములే! వీటి చర్యా వేగం ఉష్ణోగ్రతను బట్టి మారుతూ ఉంటుంది . 80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటితే ఎంజైములు చెడిపోతాయి . సూక్ష్మజీవులను నిర్జీవపరచడం , సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రత్యుత్పత్తిని అరికట్టడం , సూక్ష్మజీవులను తొలగించడం మొదలైన పద్దతుల ద్వారా ఆహారపదార్దాలను నిలువ చెయ్యవచ్చు . ప్రకృతిలోనే సహజ సిద్ధంగా సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నివారించటానికి వివిధ రకాల అమరికలు కనిపిస్తాయి . నిమ్మ , నారింజ , అరటిఫలాల పైన తొక్కలు, ఆల్మండ్, వాల్ నాట్ మొదలైన కాయల గట్టి కవచం; చేపలు , మాంసంపై ఉండే కొవ్వు లేదా చర్మం సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధిస్తాయి . ఆహారపదార్దాలను డబ్బాలలో ఉంచి సీల్ చెయ్యడం ద్వారా కూడా సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధించవచ్చు .
ఆహారపదార్దాలను నిలువ చేసే పద్ధతులు వివిధ రకాలు . అందులో మొదటిది డిహైడ్రేషన్ , సూక్ష్మ తేమను తొలగించి నీటిగాఢతను ఎండబెట్టడం ద్వారా లేదా ఈ ఆహార పదార్దాలకు చక్కెర లేదా ఉప్పును కలపడం ద్వారా సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించవచ్చు .
నిల్వ ‘ఎన్వీ ‘ తో క్యాన్సర్ ! :
మాంసాహారాన్ని నిల్వ ఉంచేందుకు సోడియం నైట్రేట్ అనే రసాయనాన్ని కలుపుతారు . అయితే ఈ నైట్రేట్ ల చర్య కారణంగా జన్యుపరివర్తన సంభవించి , అది పెద్దపేగు (కొలోన్ ) క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం లేకపోలేదని పరిశోధకులు అంటున్నారు . నైట్రేట్ లు చల్లి నిల్వ ఉంచిన మాంసాహారంతో తయారైన ‘హాట్ డాగ్స్ ‘ ని పరీక్షించిన అనంతరం వారీ నిర్దారణకు వచ్చారు .వేయించిన ఉల్లిపాయలను మాంసపు చుట్టలలో చుట్టి ఉడికించే వంటకమే ఈ హాట్ డాగ్స్. అమెరికన్లు వీటిని విపరీతంగా ఆరగిస్తారు. పరిశోధకులు స్వచ్ఛమైన నీటిని ఉపయోగించి హాట్ డాగ్స్ లోని సమ్మిళితాలను సంగ్రహించినప్పుడు ‘ఎన్ . నైట్రోసా ‘ అనే మిశ్రమం బయటపడింది . ఈ మిశ్రమాన్ని వారు ఆహారపదార్దాలలో నివాసముండే సాల్మానెల్లా బాక్టీరియాతో చర్య జరిపించగా క్యాన్సర్ కు కారణమయ్యే జన్యుపరివర్తన సంభవించింది . క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్స్ అంటారు. ”ఎన్. నైట్రోసోలలో చాలా వరకూ కార్సినో జెనిక్ లే . వీటివలన మానవదేహంలోని వివిధ అవయవాలలో క్యాన్సర్ వృద్ధి చెందే అవకాశం ఉంది”. అని ఈ పరిశోధకబృందానికి నాయకత్వం వహించిన ఐర్లండ్ ప్రొఫెసర్ మాధ్యులిక్స్ వెల్లడించారు . మాంసాహారులిక కాస్త చూసి తినడం అలవాటు చేసుకోవాలి .
ఎంతకాలం నిలవ ఉండవచ్చు ? : దైనందిన జీవితంలో ప్రత్యేకించి ఆహారపదార్దాలను భద్రం చేసే విషయంలో తగిన జాగ్రత్తలను పాటించక ఎందరో అనారోగ్యం బారిన పడుతుంటారు . అవగాహన లేమితో కాలం చెల్లిన పదార్దాలను ఆహారంగా గ్రహిస్తూ వ్యాధిగ్రస్తులవుతుంటారు . ఈ నేపథ్యంలో నిత్యం మనం ఉపయోగించే కొన్ని ఆహార పదార్దాలు అసలెంతకాలం నిలవ ఉండవచ్చో తెలుసుకోవడం మంచిదే కదా .
డబ్బాలలో ఉండే ఆహారపదార్దాలు : ఉష్ణ వాతావరణంలో ఈ తరహా ఆహారం రెండు నుంచి ఐదేళ్ళ వరకు భద్రంగా ఉండే అవకాశముంది . అయితే ఎక్స్ ఫైరీ డేట్ (పదార్థం, పాడైపోయే తేదీ )కు ముందే దానిని ఉపయోగించడం అన్ని విధాల ఆరోగ్యం. వాతావరణంలో తలెత్తే తేడాలు – ఈ డబ్బాలు తుప్పు పట్టడానికి , అందులో ఆహారం చెడిపోవడానికి కారణం కావచ్చు . ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి .
పిండిపదార్దాలు : శుద్ధిచేసిన పిండిపదార్దాలు ఎక్కువకాలం నిలవవుంటాయి. మూడు నుంచి ఆరు మాసాల వ్యవధి వరకు వీటిని ఉపయోగించుకోవచ్చు . అదే మామూలు పిండి పదార్దాలైతే మూడు నెలలలోగానే వాటిని వాడెయ్యడం క్షేమదాయకం .
తృణధాన్యాలు : గాలి చొరబడని గదులలో , ప్రదేశాలలో భద్రపరచడం ద్వారా వీటిని ఆరు మాసాలవరకు నిలవ చెయ్యవచ్చు . అయితే వాతావరణంలో మార్పులు ఈ ధాన్యవిశేషాలను మెత్తబరచి , రంగు మారేలా చేస్తాయని గ్రహించాలి .
పప్పు/ గింజ ధాన్యాలు : శుద్ధి చేసినట్లయితే ఇవి సంవత్సర కాలంపాటు నిలవవుంటాయి. వంటకు ఉపయోగపడే ముందు వీటిని శుభ్రపరచడం అవసరం .
మసాలా దినుసులు : వీటిని ఆరుమాసాల నుంచి ఏడాది వ్యవధి వరకు నిలవ చెయ్యవచ్చు . యాలకులు , లవంగాలు తదితర సుగంధ ద్రవ్యాలను కొద్ది మొత్తంలోనే కొనుగోలు చేసి భద్రపరచడం ఉత్తమం . ఈ దినుసులను సువాసన కోల్పోకముందే ఉపయోగించడం ఆరోగ్యకరం .
ఆహారపదార్దాలకు రుచినిచ్చే లవణాలు , పొడులు : వెనిగర్ తో కలిసుండే ఈ రకం లవణాలు , పొడులకు ఏడాదిపాటు నిలవ ఉండే సామర్ధ్యం కలిపిస్తుంది .
పండ్లు , కూరగాయలు నిల్వ చేసుకునే పద్ధతులు : చాలామంది గృహిణులు పండ్లు , కూరగాయలు ఫ్రిజ్ లోకి తోసేస్తారు . తప్ప ఓ పద్దతిగా సర్దుకోరు . మామిడిపండ్లు , యాపిల్స్ , చెర్రీ పండ్లు , ద్రాక్ష వంటివి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి ఫ్రిజ్ లో పెట్టాలి . అవసరమైతే ఈ బ్యాగ్స్ కు ఓ గుండుసూదితో చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవచ్చు .
పండ్లను ముందు ఉప్పు కలిపిన నీటితో కడిగితే వాటిమీద ఉన్న సూక్ష్మజీవులన్నీ తొలగించవచ్చు . ఆ తరువాత తడిపోయేదాకా ఆరబెట్టి అనంతరం ఫ్రిజ్ లో సర్దుకోవాలి . నేరేడుపండ్లు , రేగిపండ్ల వంటివి కడగకుండానే భద్రపరచాలి .
అరటిపండ్లు , పైనాపిల్ వంటివి ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు . క్యాబేజీ , క్యాలీఫ్లవర్ , బఠాణీల వంటివి ఫ్రిజ్ లో పెట్టేముందు ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ఉంచాలి . టమాటాలు ముందుగా బాగా కడిగి , తుడిచాక మాత్రమే ఫ్రిజ్ లో ఉంచాలి . బెండకాయలు , దోసకాయలను ఫ్రిజ్ లో సర్దుకునే ముందు కడగండి . శుభ్రమైన బట్టతో తుడిస్తే సరిపోతుంది .
వంకాయలు , కాకరకాయలు , ముల్లంగి , చిలకడదుంపలు , క్యారెట్లు , బీట్ రూట్లు , ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెట్టకుండా డైరెక్టుగా ఫ్రిజ్ లో సర్దాలి . ఆకుకూరల విషయానికి వస్తే ముందుగా వేళ్ళు కత్తిరించి , కడిగి ఆరబెట్టి ఫ్రిజ్ లో సర్దాలి . ఒక్కరోజు కన్నా ఆకుకూరలు ఫ్రిజ్ లో అయినా సరే ఉండవు . వీలైనంతవరకు కొన్న రోజే వీటిని వండేయాలి . ఇకపోతే చికెన్ , మటన్ వంటివి స్టోర్ చేసేముందు శుభ్రంగా కడగాలి . బ్రెడ్ , కేక్స్ , పేస్త్రీల వంటివి వ్యాక్స్ పేపర్ లో భద్రపరచి ఫ్రిజ్ లో పెట్టాలి .
పై విధంగా సర్దుకుంటే త్వరగా పాడవ్వకుండా ఉంటాయి .
కోడిగుడ్డును ఎలా జాగ్రత్తపరచాలో చూద్దాం .. : మార్కెట్ నుంచి తేగానే ఫ్రిజ్ లో పెట్టాలి . ఫ్రిజ్ లో పెట్టేముందు గుడ్లను కడగొద్దు . కడగడం వలన గుడ్లు పెంకు చుట్టూ సహజసిద్దంగా ఉండే రక్షణపొర పోతుంది . ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లు రెండు మూడు వారాల పాటు పాడుకావు . గుడ్లు పెంకుపై కొన్ని వేల రంధ్రాలు ఉంటాయి . అందుకని కోడిగుడ్లను ఘాటైన వాసనలు ఉండే పదార్దాలుకూ దూరంగా పెట్టాలి .
ఎన్నో రకాల కంటెయినర్లు .. : ఎప్పుడో ప్రొద్దుననగా ఆఫీస్ కు బయలుదేరుతాం . మధ్యాహ్నం దాకా పదార్దాల పోషకవిలువలు కోల్పోకుండా కాపాడుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు . మజ్జిగ , ఫ్రూట్ జ్యూస్ , సూప్ లాంటివి పెట్టుకోవడానికి తాజాదనం కోల్పోకుండా చూసే ప్రత్యేక లక్షణాలున్న కంటెయినర్లు , టిఫిను క్యారియర్లు ఎన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి . అలాంటివాటిని ఎంపిక చేసుకోండి .
కూరగాయలు భద్రపరచుకోవడానికి ఫ్రిజ్ లేనివారు ఏం చెయ్యాలంటే ..: మూతఉన్న వెడల్పాటి డబ్బా ఒకటి తీసుకొని దాని అడుగున భాగాన ఉప్పు వెయ్యండి . ఇప్పుడు ఆ డబ్బాలో నిమ్మకాయలు వేసుకోవచ్చు . తాజాగా ఉండడమే కాదు రసం కూడా ఎక్కువగా వస్తుంది . లేదంటే ఓ పాత్రలో నీళ్ళు పోసి అందులో నిమ్మకాయలు వెయ్యాలి . అయితే రోజూ ఆ నీటిని మారుస్తూ ఉండాలి . వడిలిపోయినట్లున్న టమాటాలను కూడా ఉప్పు నీటిలో కొద్దిసేపు ఉంచితే తాజాగా ఉంటాయి .
Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.
Phone no : +91 9989759719
0 Comments